Hyderabad, July 19: తెలంగాణలో కొవిడ్19 తీవ్రత కొనసాగుతుంది. అయితే గత కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విజృంభించిన కరోనావైరస్ ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుంది. రోజురోజుకు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1296 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 45,076 కి చేరుకుంది.
ఆదివారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 557 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 111 కేసులు, మేడ్చల్ నుంచి 87, సంగారెడ్డి నుంచి 28 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.
మరోవైపు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి. పలు జిల్లాల్లో ఈరోజు కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇవాళ ఒక్కరోజే 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు వరంగల్ రూరల్ నుంచి కూడా 41 కేసులు నిర్ధారించబడగా, కామారెడ్డి నుంచి 67 మందికి కరోనా సోకినట్లు తేలింది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 6 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 415 కు పెరిగింది.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 1831 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 32,438 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 12,519 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,65,219 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.