Sample Testing (Photo Credits: PTI)

Hyderabad, June 7:తెలంగాణలో ఆదివారం మరో 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3,650 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3202 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 132 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి 12,  మేడ్చల్ నుంచి 3, యాదాద్రి నుంచి 2,  నాగర్ కర్నూల్, కరీంనగర్, సిద్ధిపేట మరియు మహబూబాబాద్ జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

ఇటు కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూపోతోంది. ఆదివారం మరో 14 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 137 కు పెరిగింది.

ఇదిలా ఉంటే ఈరోజు మరో 32 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1742 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1771 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

జూన్ 8 నుంచి కేంద్రం ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలుపై చర్చించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.

దీనికంటే ముందు మధ్యాహ్నం 2 గంటలకు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మంత్రి, సంబంధిత అధికారులతో సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసే దిశగా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి రానున్నట్లు ప్రచారంలో ఉంది.