COVID19 in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 170 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, అర్హులైన వారు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని అధికారుల సూచన
ప్రస్తుతం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి టీకాల పంపిణీ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు....
Hyderabad, March 6: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, పాజిటివ్ కేసులు క్రమేణా స్వల్ప స్థాయిలో పెరుగుతున్నట్లు తెలుస్తుంది. నిన్న,మొన్నటి వరకు 150 వరకు వచ్చిన కొత్త కేసులు ఆ తర్వాత 160 తాజాగా, 170కి చేరుకున్నాయి. అయితే రికవరీల సంఖ్య కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుండటంతో రాష్ట్రంలోని ఆక్టివ్ కేసుల్లో భారీ హెచ్చుతగ్గులేమి ఉండటం లేదు.
నిన్న రాత్రి 8 గంటల వరకు 40,712 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 170 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 568 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,99,742కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 15, మరియు రంగారెడ్డి నుంచి 14 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 1 కోవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,640కు పెరిగింది.
మరోవైపు శుక్రవారం సాయంత్రం వరకు మరో 196 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,96,166 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1936 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి టీకాల పంపిణీ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 5,35,472 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Mar 06, 2021 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

