Hyderabad, June 11: కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రజల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే దేశంలో సెకండ్ వేవ్ కోవిడ్ విజృంభించిందని, ఇదే ప్రభావం నిస్సందేహంగా మూడో వేవ్ కరోనా ఉత్పన్నమవడానికి దోహదపడుతుందని పిఎస్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జిసి ఖిల్నాని అన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకనే దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమని ఆయన అన్నారు. ఈ విషయంలో స్వీయ రక్షణే వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఏకైక మార్గం డా. ఖిల్నాని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో కేవలం 4 శాతం మంది వ్యాక్సిన్ యొక్క రెండు డోసులు తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. కరోనా యొక్క డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ల ద్వారా కూడా పూర్తిగా నిరోధించబడటం లేదని ఆయన హెచ్చరించారు. కొన్ని వేరియంట్లపై వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయనందున రెండో డోసు యొక్క వ్యవధిని తగ్గించాలని లాన్సెట్ జర్నల్ ఇటీవల ఒక అధ్యయనంలో స్పష్టం చేసిందని ఆయన వెల్లడించారు. థర్డ్ వేవ్ తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, థర్డ్ వేవ్ లో కరోనా బారినపడిన బాధితుల లక్షణాలను బట్టే దాని తీవ్రతను అంచనా వేయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక, తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,066 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1707 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1009 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,00,318కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 158 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 147, ఖమ్మం నుంచి 124 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 16 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,456కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 2,493 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,74,103 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,759 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.