TS's COVID Report: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా 1914 కేసులు నమోదు, 11 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Telangana CS Somesh Kumar | File Photo/ TS IPR

Hyderabad, April 7:  తెలంగాణలో సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ఇటీవలే ఏప్రిల్ 2న కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నిత్యం వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ పాలనా యంత్రాంగాన్ని నడిపించే సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం కొంత అస్వస్థత అనిపించడంతో కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు, అధికారిక కార్యక్రమాలకు స్వల్ప విరామం ప్రకటించారు. అయితే సీఎస్ తో సన్నిహితంగా మెలిగిన వారిలో ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైంది.  తాత్కాలిక సచివాలయం ముఖ్య భద్రతాధికారికి కరోనా సోకింది. అలాగే జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ సివిల్‌ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు

రాష్ట్రంలో కేసులు వేగంగా పెరుగుతుండటం, అటు హైకోర్టు కూడా కోవిడ్ పరిస్థితుల పట్ల నివేదికలు కోరడంతో తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు చేసే వాటికంటే రెట్టింపు సంఖ్యలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు బయటపడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 74,274 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1914 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 3,202 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,16,649కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 393 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 205 కేసులు, రంగారెడ్డి నుంచి 169, నిజామాబాద్ నుంచి 179 మరియు నిర్మల్ నుంచి 104 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,734కు పెరిగింది.

అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 285 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,03,298 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,617 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 14.55 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.