
Hyderabad, April 9: తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తుంది. మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నుండి పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ బారిన పడకుండా అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతోంది.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,01,986 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,478మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 3,907 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,21,182కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 402 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 208 కేసులు, రంగారెడ్డి నుంచి 162, నిజామాబాద్ నుంచి 176, నిర్మల్ నుంచి 111 మరియు జగిత్యాల నుంచి 105 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,746కు పెరిగింది.
అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 363 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,03,964 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 17.83 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.