Hyderabad, May 21: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా మరో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1661 కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గత రెండు, మూడు వారాలుగా 35- 50 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తుండగా నిన్న ఆ సంఖ్య స్వల్పంగా తగ్గింది, బుధవారం కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 89 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది.
గత 24 గంటల్లో కొత్తగా మరో 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 40కి పెరిగింది. మరోవైపు, నిన్న మరో ఇద్దరు కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1013 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 608 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
జీహెచ్ఎంసీలో ఖైరతాబాద్, ఎల్బీనగర్, మలక్ పేట్, కార్వాన్ మరియు చార్మినార్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా వర్గీకరించారు. వీటిలోనే 72 కంటైన్మెంట్ ప్రాంతాల నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా జోన్లలో కఠినమైన లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ 5 జోన్లు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, జనాలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రజలు ఎవరికి వారుగా స్వచ్ఛంధంగా భౌతిక దూరం ఇతర జాగ్రత్తలను పాటిస్తూ కరోనా నిర్మూలించడానికి సహాయపడాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్ తదితరులు తమతమ నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సుల్లో కొంతదూరం ప్రయాణించి పరిస్థితులను సమీక్షించారు.
జీహెచ్ఎంసీ కాకుండా రాష్ట్రానికి వలస వస్తున్న వారిలో కొందరికి పాజిటివ్ గా నిర్దారింపబడుతుంది. ప్రతిరోజు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వలస వచ్చేవారు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.