
Hyderabad, April 13: తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ రోజురోజుకి మరింత తీవ్రమవుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ మరియు ఇతర పరిసర ప్రాంత జిల్లాలు, అలాగే కర్ణాటకతో సరిహద్దును పంచుకునే సంగారెడ్డి జిల్లా , ఇక అన్ని ప్రాంతాల నుంచి రవాణ మరియు రాకపోకలు ఎక్కువగా జరిగే హైదరాబాద్ నగరంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జనసాంద్రత కూడా ఎక్కువగా ఉండటం మూలానా ఒకరి నుంచి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం యొక్క సరిహద్దుల వద్ద రాకపోకలపై, థియేటర్లలో మరియు ఇతర రద్దీ ప్రాంతాలలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రజారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే బయట మాస్క్ లేకుండా తిరిగే వారికి అధికారులు చలానాలు విధిస్తున్నారు.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,13,007 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,052 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 4135 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,32,581కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 406 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 301 కేసులు, రంగారెడ్డి నుంచి 248, నిజామాబాద్ నుంచి 279, నిర్మల్ నుంచి 113 జగిత్యాల నుంచి 135, సంగారెడ్డి నుంచి 123, కామారెడ్డి నుంచి 111, మరియు నల్గొండ నుంచి 109 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,772కు పెరిగింది.
అలాగే సోమవారం సాయంత్రం వరకు మరో 778 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,131 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు 2 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5.67 లక్షల డోసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే విషయమై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్.. కేంద్ర ఆరోగ్య శాఖను సంప్రదించారు. రాబోయే 15 రోజుల కోసం అత్యవసరంగా 30 లక్షల డోసులను తెలంగాణకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. కాగా, ఈ లేఖకు స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ తెలంగాణ కోసం 3.62 లక్షల డోసులను పంపిస్తున్నట్లు తెలియజేశారు.