Second Wave in TS: గతంలోలాగా కాదు..సెకండ్ వేవ్ అంతకుమించి, తెలంగాణలో వెల్లువలా కేసులు, ఒక్కరోజులోనే 3,840 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 30 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య; ఆసుపత్రుల్లో బెడ్లు పెంచాలని సీఎస్ ఆదేశం
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, April 16: సెకండ్ వేవ్‌లో తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఒకరోజును మించి ఒకరోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలోని కోవిడ్ రోగులకు కేటాయించే బెడ్‌ల సంఖ్యను మరింత పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలి, అదే విధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వాడకం పట్ల నియంత్రణ కలిగి ఉండాలని సోమేష్ కుమార్ సూచించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, అందుకు తగినట్లుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు ఎల్లవేళలా మాస్కులు తప్పనిసరిగా ధరించడం సహా, ప్రభుత్వం జారీ చేసిన అన్ని నిబంధనలను పాటించేలా చూడాలని, రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని జిల్లా కలెక్టర్‌లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,21,880 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,840 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 5,095 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,41,885కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 505 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 407 కేసులు, రంగారెడ్డి నుంచి 302, నిజామాబాద్ నుంచి 303, సంగారెడ్డి నుంచి 175, జగిత్యాల నుంచి 167 , నిర్మల్ నుంచి 159, కామారెడ్డి నుంచి 144, కరీంనగర్ - మహబూబ్ నగర్ జిల్లా నుంచి చెరి 124, నల్గొండ 116, వరంగల్ అర్బన్ 114, ఖమ్మం 111 మరియు మంచిర్యాల జిల్లా నుంచి 101 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 9 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,797కు పెరిగింది.

అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 1198 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,09,594మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో సుమారు 33.60 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.