Hyderabad, August 24: వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి కారణమేంటనేది నిర్దారించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని ఆసుపత్రుల్లో పరీక్షలు మరియు చికిత్సకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యశాఖను సీఎం ఆదేశించారు.
అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామాల్లో పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఐఆర్ఎస్, ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. అవసరమైన మేర మందులు ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. ప్రజలు వారి వారి నివాసాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, దోమకాటు బారిన పడకుండా పిల్లలు, వృద్ధులను కాపాడుకోవాలని అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కోరారు. ఈ వానాకాలం సీజన్ ముగిసే వరకు వైద్యాశాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,347 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 389 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,283 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,55,732కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 36 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 1 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,862కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 420 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,45,594 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,276 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.