Hyderabad, May 17: తెలంగాణలో రోజూవారీ కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూపోతున్నాయి. ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆక్టివ్ కోవిడ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, లాక్డౌన్ అమలవుతున్న తీరు, బ్లాక్ ఫంగస్ చికిత్స తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్ధేశం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోరిక మేరకు తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 26 వరకు పెంచుతున్నట్లు ఎంసెట్ కన్వీనర్ సోమవారం ప్రకటించారు. ఇప్పటివరకు 1 లక్ష 50 వేలకు పైబడి ఎంసెట్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,591 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,961 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,164 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,32,784కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 631 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 258 కేసులు, రంగారెడ్డి నుంచి 257, ఖమ్మం నుంచి 229 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 30 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,985కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 5,559 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,80,458 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.