
Hyderabad, March 24: తెలంగాణలో కోవిడ్19 దాదాపు నియంత్రణలోకి వచ్చిందనుకుంటున్న దశలో మహమ్మారి ఉధృతి అంతకంతకూ ఎక్కువవుతోంది. రాష్ట్రంలో మరో రోజు 4 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లోనూ కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో కేసులు పెరగటానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ భావిస్తోంది. బహిరంగ ప్రదేశాలలో మరియు రద్దీగా ఉండే చోట ప్రజలు మాస్కులు ధరించకపోవటంతో పాటు, ఇతర అన్ని కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ విస్తరణ మరింత పెరగకుండా ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈరోజు నుంచి విద్యాసంస్థల మూసివేతకు నిర్ణయించారు. ఇక సినిమా హాళ్లు, పార్కులు మరియు ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న ప్రదేశాలలో నిబంధనలు అమలు చేయనున్నారు. రోడ్ల పైన మాస్కులు లేకుండా తిరిగే వారికి భారీ జరిమానా విధించటానికి కూడా సిద్ధమవుతోంది ప్రభుత్వం.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 70,280 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 431 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 745 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,04,298కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 111 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 31 కేసులు, మేడ్చల్ నుంచి 37, జగిత్యాల మరియు మంచిర్యాల జిల్లాల నుంచి చెరి 21 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,676కు పెరిగింది.
అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 228 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,99,270 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,352 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.