Hyderabad, December 30: తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే యూకే మూలాలు కలిగిన జన్యుపరివర్తన చెందిన నూతన వైరస్ ఇప్పుడు రాష్ట్రానికి మరో కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో మరో 6 మందికి కొత్త వేరియంట్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. మిగతా ఐదుగురిలో ముగ్గురు కర్ణాటకకు చెందినవారు కాగా, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
అయితే UK స్ట్రెయిన్ భయంకరమైనది కాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ అన్నారు. ఈ కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ కు చంపే శక్తి లేదు, ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నాము. కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 45,590 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 474 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 775 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 68,39,281 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
Telangana's COVID19 Bulletin:
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 285,939కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 49, మేడ్చల్ నుంచి 45 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,538కు పెరిగింది.అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 592 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 278,523 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,878 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.