Coronavirus Cases in India (Photo Credits: PTI)

Hyderabad, April 18: తెలంగాణలో తాజాగా 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (new coronavirus cases) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,12,563 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,824గా (Covid Deaths) ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 37,037 మంది కరోనాకు చికిత్స (TS Coronavirus) పొందుతున్నారు. వారిలో 24,156 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 743 మందికి క‌రోనా సోకింది.

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధి రాజిపేటలో ఓ వృద్ధురాలు (75) కరోనాతో శనివారం మృతి చెందింది. స్థానికంగా ఉండే ఆమె ఏకైక కుమార్తెకు విషయం తెలిసినా రాకపోగా మిగతా బంధువులూ స్పందించలేదు. దీంతో కౌన్సి లర్‌ దామెర మొగిలి మున్సిపల్‌ సిబ్బంది సాయం తో మృతదేహాన్ని ఖననం చేయించారు. పీపీఈ కిట్లు ధరించి వృద్ధురాలి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో శ్మశాన వాటికకు తరలించి ఖననం చేశారు.

సూటిపోటి మాటలతో వేధింపులు : వ్యక్తి ఆత్మహత్య 

ఇక కరోనా వైరస్‌ సోకిందని స్థానికులు సూటిపోటి మాటలతో వేధించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. చనిపోయిన వ్యక్తిని తాండూరులోని సీతారాంపేట్‌కు చెందిన హన్మంత్‌గా గుర్తించారు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణయ్య హన్మంత్‌ మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముందుకు రాకపోవడంతో కరోనా వైరస్‌ సోకి ఆత్మహత్య చేసుకున్న హన్మంత్‌ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు, బంధువులు ముందుకురాలేదు. కుటుంబీకుల సమాచారంతో తాండూరు యువజన సంఘం సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు సజీవ దహనం, దేశంలో కొత్తగా 2 ,61,500 మందికి కరోనా నిర్ధారణ, తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్

రాష్ట్రంలో కరోనా టీకా కొరత కారణంగా సర్కారు ఆస్పత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే అధికారికంగా అలా ప్రకటించకుండా ఆదివారం సెలవు కాబట్టి నిలిపి వేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఓ ప్రకటన జారీ చేశారు. సోమవారం నుంచి టీకా వేస్తామని ఆయన తెలిపారు. అయితే ఆదివారం కేంద్రం నుంచి 2.7 లక్షల టీకాలు వస్తేనే మరుసటిరోజు వ్యాక్సినేషన్‌ కొనసాగే అవకాశముంది.

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దని చెప్పినందుకు మున్సిపల్‌ కార్మికులపై దాడికి యత్నించిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.స్థానిక గౌతంనగర్‌లో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. ‘‘నేను మాస్కు పెట్టుకోకపోతే.. మీ కేంటి’’ అంటూ పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి యత్నించాడు. ఇందుకు అతడి కొడుకు కూడా జతయ్యాడు. కాగా తండ్రీకొడుకుల ప్రవర్తనపై మున్సిపల్‌ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవు : రాజారావు

కరోనా సెకెండ్‌ వేవ్‌ మరింత ప్రమాదకరంగా మారి, కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయ్యిందని, ఈ తరుణంలో లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవని, ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను నియంత్రించవచ్చని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చామని, ప్రాణాపాయస్థితిలో ఉన్న కరోనా రోగులను మాత్రమే ఇకపై గాంధీలో చేర్చుకుంటామన్నారు. మొదటి వేవ్‌లో కరోనా సోకిన రెండు, మూడు రోజులకు శరీరంలో వైరస్‌ లోడ్‌ పెరిగేదని, సెకెండ్‌ వేవ్‌లో కేవలం గంటల వ్యవధిలో పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

ఏపీలో పరుగులు పెడుతున్న సెకండ్ వేవ్, తాజాగా 7,224 మందికి కరోనా, చిత్తూరులోనే అత్యధికంగా గత 24 గంటల్లో 1051 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 96 కేసులు

నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్‌ మృతదేహం తారుమారైంది. పూర్తిగా పరిశీలించకుండానే తమకు చెందిన మృతదేహమే అనుకుని అంత్యక్రియలు నిర్వహించేశారు. తీరా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఆరాతీసేసరికి అసలు విషయం బయటపడింది. నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అహ్మద్‌పురకాలనీకి చెందిన మైనారిటీ వర్గానికి చెందిన మహిళ (78) కొవిడ్‌ తో బాధపడుతూ రెండ్రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది.

కాగా, ఇదే సమయంలో గాయత్రినగర్‌కు చెందిన మరో మహిళ (65) కొవిడ్‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ రెండు మృతదేహాలను ప్యాక్‌చేసి పోస్టుమార్టం గది పక్కకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన బంధువులెవరూ లేరు. గాయత్రినగర్‌కు చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌తో మహిళ చనిపోయిందని గాయత్రినగర్‌ వాసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ప్యాక్‌ చేసి ఉన్న మృతదేహాన్ని పరిశీలించకుండానే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించేశారు. అనంతరం మైనారిటీ వర్గం వారు వచ్చి తమ బంధువు మృతదేహం గురించి వెదకగా కనిపించలేదు.

దీంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి అధికారులు గాయత్రి నగర్‌ వాసులను పిలిపించారు. అక్కడ ఉన్న మృతదేహాలను మళ్లీ పరిశీలించగా గాయత్రినగర్‌ మహిళ మృతదేహం అక్కడే ఉంది. ఇంతకు ముందు తీసుకెళ్లిన మృతదేహాన్ని చూడలేదని తెలపడంతో మైనారిటీకి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు, అడిషనల్‌ కలెక్టర్‌ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. రెండు వర్గాలను సముదాయించారు. దీంతో మైనారిటీ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మృతదేహం తారుమారుపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపడుతున్నారు.