
Hyderabad, April 22: తెలంగాణలో నిన్నటి కంటే ఈరోజు కోవిడ్ కేసులు తగ్గినప్పటికీ, కరోనా ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కోవిడ్ కేసులు భయపెట్టే రీతిలో భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో నిజామాబాద్ జిల్లా కోవిడ్ హాట్ స్పాట్ గా తయారైంది. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బెడ్ల కొరత, వైద్యం దొరకక ఇబ్బంది పడే వారంతా సమీపంలో ఉన్న నిజామాబాద్ వస్తున్నారు. దీంతో ఈ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
మరోవైపు చాలా చోట్ల ఆక్సిజన్ కొరత, కోవిడ్ చికిత్సకు ఉపయోగించే ఔషధాల కొరత, ఆసుపత్రులో వైద్య సిబ్బంది, వనరుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరతపై తయారీదారులతో చర్చించిన మంత్రి కేటీఆర్ వెంటనే వాటి ఉత్పత్తి పెంచాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో త్వరలోనే 4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,02,335 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 5,567 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 4,701 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,73,468కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 989 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 421 కేసులు, రంగారెడ్డి నుంచి 437 మరియు నిజామాబాద్ నుంచి 367 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 23 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,899కు పెరిగింది.
అలాగే బుధవారం సాయంత్రం వరకు మరో 2,251 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,21,788 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 41.8 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.