COVID in TS: తెలంగాణలో కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను నేరుగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం, ఏ విషయంలో ఎలాంటి కొరత రావొద్దని అధికారులకు సీఎం ఆదేశం
Image of Gandhi Hospital, COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, May 3: తెలంగాణలో కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి, నిన్న వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా తక్కువగా నిర్వహించడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయినప్పటికీ 5 వేలకు పైగా కేసులు వచ్చాయంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఇంకా తీవ్రంగానే ఉన్నాయనిఅర్థం చేసుకోవాలి. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేంధర్ ను తొలగించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తుంది.

కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్ ల విషయంలో గానీ, ఆక్సీజన్ మరియు బెడ్ ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయవద్దని, సీఎస్ ను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 58,742 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 5,695 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 3,945 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,56,485కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,352 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 427 కేసులు, రంగారెడ్డి నుంచి 483, వరంగల్ అర్బన్ నుంచి 393 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 49 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,417కు పెరిగింది.

అలాగే ఆదివారం సాయంత్రం వరకు మరో 6,206 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,73,933 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఇకపై 45 ఏళ్లు పైబడిన వారికి  ప్రీ-బుకింగ్ ప్రాతిపదికన మాత్రమే టీకా లభిస్తుందని, రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కేంద్రంలోనూ నేరుగా వెళ్లి టీకా పొందలేరని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపై GHMC పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లో ప్రతిరోజు 200 స్లాట్లు, ఇతర ప్రాంతాలలో 100 అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా పొందాలనుకునే వారు కొవిన్ ద్వారా తమ స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది.