
Hyderabad, May 7: తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా కోవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 74 వేల కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించని నేపథ్యంలో ప్రజలు తమకుతాముగా రక్షణ పాటిస్తూ కరోనా బారినపడకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.
కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో కోవిడ్ ఓపి సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఓపి నిర్వహణకు చేసిన ఏర్పాట్ల విషయమై తెలుసుకున్నారు. లక్షణాలు ఉన్నవారికి రిపోర్టు కోసం ఆగకుండా వెంటనే మందుల కిట్ ను అందించి చికిత్సను ప్రారంభించాలన్నారు. మందులు వాడుతున్నప్పటికీ నాలుగు, ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోతే స్టిరాయిడ్ ను వాడాలని దీనివలన ఆసుపత్రులలో చేరికను నివారించడం జరుగుతుందన్నారు. స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రులలో ఓపి చికిత్సకు హాజరై, ఉచితంగా అందజేసే మందులను వాడాలని సీఎస్ అన్నారు.
ఇక, ధైర్యమే కరోనాకు మందు అని కోవిడ్ బారినపడి కోలుకున్న చాలా మంది తమ అనుభవాలను చెబుతున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత భయాందోళనకు గురికాకుండా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి క్రమం తప్పకుండా మందులు, మంచి ఆహారం తీసుకోవాలి, పరిశుభ్రంగా ఉండాలి అని చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఇంట్లో అందరూ మాస్కులు వేసుకోవాలని చెబుతున్నారు. వారం-పది రోజుల్లో కరోనా నయం అవుతోంది. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఆసుపత్రిలో చేరాలి. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చునని చెబుతున్నారు.
రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 76,047 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 5,892 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 3,127 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,81,640కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,104 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 378 కేసులు, రంగారెడ్డి నుంచి 443, నల్గొండ నుంచి 323 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 46 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,625కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 9,122 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,05,164 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,81 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.