Hyd, 28: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ వేరియంట్ కేసులు (Omicron in Telangana) పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు (state tally reaches to 62) చేరింది. రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను ప్రజలు గర్తించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటివరకు 62 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని తెలిపారు. నిన్న ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కోవిడ్ టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు (Health Minister Harish Rao) తెలిపారు. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకా వేస్తామన్నారు. కోవిన్ పోర్టల్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. హైదరాబాద్, పురపాలికల్లో కోవిన్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. పీహెచ్ సీలు , వైద్యకళాశాలల్లో టీకాలు వేయనున్నట్లు మంత్రి తెలిపారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేస్తామన్నారు.
అర్హులైన పిల్లలందరికీ కోవాగ్జిన్ టీకా వేస్తామని, కోవాగ్జిన్ టీకాను కేంద్రం సూచించిందని తెలిపారు. రాష్ట్రంలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని 61 సంవత్సరాలు దాటిన వారు 41.60 లక్షల మంది ఉన్నారని తెలిపారు. జర్నలిస్టులకు బూస్టర్ డోసు ఇస్తామని మంత్రి తెలిపారు.