Representational Image (Photo credits: PTI)

Hyd, Dec 28: వచ్చే ఆర్థిక సంవత్సరం.. 2022 ఏప్రిల్‌ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. ప్రతి ఇంటిలో వాడే కరెంటుపై యూనిట్‌కు నేరుగా 50 పైసలు, ఇతర కనెక్షన్ల వారి నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున అదనంగా ఛార్జీ వసూలు (Electricity bills set to go up in Telangana) చేయాలనే పెంపు ప్రతిపాదనలను సోమవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌ శ్రీరంగారావుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు రఘుమారెడ్డి, ఎ.గోపాలరావులు అందజేశారు. అనంతరం వారిద్దరూ మీడియా సమావేశంలో ఈ ప్రతిపాదనల వివరాలను వెల్లడించారు.

గతంలో ప్రభుత్వం ఛార్జీలు (Electricity bills) పెంచవద్దని అంతర్గతంగా నిర్ణయించడంతో గత అయిదేళ్లుగా డిస్కంలు ఛార్జీల సవరణ ప్రతిపాదనలే ఈఆర్‌సీకివ్వలేదు. ఇక ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈసారి ప్రతిపాదనలిచ్చాయి. ఇక ఈఆర్‌సీ ఆమోదం లాంఛనప్రాయమే. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు 200 యూనిట్లు వాడే ఇళ్లకు అదనంగా నెలకు రూ.100 వరకూ భారం పడనుంది. అంతకుమించి వాడేవారిపై భారం మరింత ఎక్కువ ఉంటుంది. రాష్ట్రంలో 1.10 కోట్ల గృహ కనెక్షన్లలో అందరికీ ఒకేస్థాయిలో యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంపు ప్రతిపాదించినట్లు సీఎండీలు వివరించారు.

సీఎం కేసీఆర్ పిరికిపంద అంటూ ఈటెల విమర్శ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేది బండి సంజయ్ అంటున్న అరవింద్, దీక్ష సమయంలో బాత్రూంలో ఇడ్లీలు తిన్న చరిత్ర కేసీఆర్‌ది అంటూ బండి సంజయ్ విమర్శలు

విద్యుత్‌ చట్టం ప్రకారం కరెంటు ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వ పాత్ర నేరుగా ఉండదు. ఆదాయ, వ్యయాల లెక్కలను బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరాని(2022-23)కి 'వార్షిక ఆదాయ అవసరాల'(ఏఆర్‌ఆర్‌) నివేదికతో పాటు, ఛార్జీల సవరణ ప్రతిపాదనలను నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్‌సీకి ఇవ్వాలని విద్యుత్‌ చట్టం చెబుతోంది. ఈ నివేదికలను ప్రజల ముందు పెట్టి బహిరంగ విచారణ జరిపి ఛార్జీలు పెంచాలా వద్దా.. పెంచితే ఎంత అనేది ఈఆర్‌సీ నిర్ణయించి మార్చి 31లోగా తుది తీర్పు చెబుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

ఒక నెల కరెంటు బిల్లులో ఎన్ని యూనిట్ల కరెంటు వినియోగించారనే దానిని బట్టి సదరు కనెక్షన్‌ ఏ విభాగంలోకి వస్తుందనేది కంప్యూటర్‌ నిర్ణయించి బిల్లు వేస్తుంది. ఒక ఇంటిలో నవంబరులో 200 యూనిట్లు వాడితే ఆ బిల్లు ఎల్‌టీ-1(బి1) విభాగం 101 నుంచి 200లోపు వాడిన విభాగం కిందకు వస్తుంది. అంటే 1 నుంచి 100 వరకూ యూనిట్‌కు ప్రస్తుతం రూ.3.30, తరవాత 101 నుంచి 200 యూనిట్లకు రూ.4.30 చొప్పున ఛార్జీ పడుతుంది.

అదే ఇల్లు ఒకవేళ 201 యూనిట్లు వాడితే ఎల్‌టీ-1(బి2) విభాగంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నేరుగా 1 నుంచి 200 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.5 చొప్పున ఛార్జీ పడుతుంది. అన్ని విభాగాల్లో ప్రతి యూనిట్‌కూ నేరుగా 50 పైసలు అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.

తెలంగాణ PCC చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు...

గత అయిదేళ్లుగా రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచలేదని సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి తెలిపారు. కరోనా విపత్తు డిస్కంలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 'కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పలు రకాలుగా ఆర్థికభారం పడింది. గ్రీన్‌ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై రూ.50 ఉంటే కేంద్రం రూ.400కి పెంచింది. బొగ్గు ధర టన్నుకు అదనంగా రూ.800 పెంచారు. రైల్వే రవాణా ఛార్జీలు గత నాలుగేళ్లలో 40 శాతం అదనంగా పెరిగాయి. ఉద్యోగులకు రెండుసార్లు వేతన సవరణ, పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు.. భారం డిస్కంలపై పడింది' అని వివరించారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థ మెరుగుకు డిస్కంలు గత ఏడేళ్లలో రూ.34,087 కోట్లు ఖర్చు పెట్టాయని వివరించారు.

డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో పెట్టి వచ్చే సూచనలను ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి వచ్చే మార్చి 31లోగా తుది తీర్పు ఇస్తాం. డిస్కం ఆదాయ, వ్యయాలపై ఇచ్చిన అంచనాలు, ఛార్జీల పెంపు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించిన తరవాత ఛార్జీలు ఎంత పెంచాలనేది ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఈఆర్‌సీ ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తే అవి అమల్లోకి వస్తాయి. లేకపోతే ఎంత పెంచాలని నిర్ణయిస్తే అంతగా అవి అమలవుతాయని సీఎండీలు గోపాలరావు, రఘుమారెడ్డి అన్నారు.

ప్రస్తుత ఛార్జీల ప్రకారం...

ఒక ఇంటిలో నెలకు 201 యూనిట్ల కరెంటు వాడారనుకుందాం. బిల్లు 200 యూనిట్లు దాటినందున ఎల్‌టీ-1(బి2) విభాగంలోకి వస్తుంది. మొదటి 200 యూనిట్లకు రూ.5 చొప్పున రూ.1000, మిగిలిన యూనిట్‌కు రూ.7.20 కలిపి మొత్తం 201 యూనిట్లకు రూ.1007.20 బిల్లు, ఇంధన రుసుంతో కలిపి రూ.1100 వరకూ బిల్లు వస్తుంది.

ప్రతిపాదిత ఛార్జీల ప్రకారం...

మొదటి 200 యూనిట్లకు రూ.5.50 చొప్పున రూ.1,100, మిగిలిన యూనిట్‌కు రూ.7.70 కలిపి మొత్తం 201 యూనిట్లకు కలిపి 1107.70 ఛార్జి, ఇంధన రుసుంతో రూ.1200 వస్తుంది. అంటే 201 యూనిట్ల కరెంటు వాడే ఇంటికి నేరుగా రూ.100 అదనంగా పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.