Delta Variant Alert: తెలంగాణలో డెల్టా వేరియంట్ కరోనావైరస్ యాక్టివ్‌గా ఉంది, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరిన ఆరోగ్యశాఖ; రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 746 కోవిడ్ కేసులు నమోదు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, July 20: భారతదేశంలో ఈ ఏడాది మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో సెకండ్ వేవ్ కోవిడ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సెకండ్ వేవ్ విజృంభనకి కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్ (B 1.617.2) కారణమని నిపుణులు గుర్తించారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా, డెల్టా వేరియంట్ రకం వైరస్ ఇప్పటికీ పూర్తిగా అంతమవ్వలేదని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సహా, దేశంలో చాలా చోట్ల డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని టీఎస్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఇటీవల కాలంగా తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సుమారు 7 వందలకు కొంచెం అటూఇటుగా నమోదవుతున్నాయి. గత కొన్ని వారాలుగా, రాష్ట్రంలోని కనీసం పది జిల్లాల్లో నమోదయ్యే కోవిడ్ కేసుల్లో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, జీహెచ్‌ఎంసీ, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, మేడ్చల్-మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, సూర్యాపేట మరియు వరంగల్ అర్బన్ మరియు వరంగల్ రూరల్ జిల్లాల్లో కోవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

డెల్టా వేరియంట్ ఎప్పుడు బలహీనపడుతుందనే దానిపై అనిశ్చితి ఉంది, కాబట్టి ఈ పండుగల సీజన్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల క్షీణత నెమ్మదిగా ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కొన్ని చోట్ల కోవిడ్ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది.  ప్రజల సహకారం మాత్రమే థర్డ్ వేవ్ కరోనాను నియంత్రించడంలో సహాయపడుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు సలహా ఇచ్చారు.

ఇక, తెలంగాణలో సోమవారం 1,20,165 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా మరో 746 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిన్న రాష్ట్రంలో కరోనాతో మరో 5 మంది ప్రాణాలు కోలుకోగా, 729 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,836 ఆక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తమ నివేదికలో పేర్కొంది.