
Hyderabad, April 30: తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ గడువు నేటితో ముగిసిపోనుంది. ఇక రేపట్నించి కూడా కర్ఫ్యూ అమలు కొనసాగించే విషయమై సీఎస్ సోమేష్ కుమార్ ప్రభుత్వంతో చర్చించి ఈరోజు ప్రకటించనున్నారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనలు లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, సీఎం కేసీఆర్ కూడా మరికొన్ని రోజులు హోం ఐసోలేషన్ లోనే ఉండాల్సి ఉంది. డాక్టర్ ఎం.వి. రావు ఆధ్వర్యంలోని చికిత్స పొందుతున్న కేసీఆర్ కు మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే రాపిడ్ యాంటీజెన్ పరీక్షలో కోవిడ్ నెగెటివ్ అని రిపోర్ట్ రాగా, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మాత్రం ఫలితం మిశ్రమంగా వచ్చింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు వెల్లడించారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎం.వీ. రావు తెలిపారు.
ఇక, రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 77,091 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 7,646 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 4,492 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,35,606కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,441 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 631 కేసులు, రంగారెడ్డి నుంచి 484 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 53 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,261కు పెరిగింది.
అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 5,926 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,55,618 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.