
Hyderabad, July 6: దేశంలో సెకండ్ వేవ్ దాదాపు తగ్గిపోయిందని అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వ్యాప్తి ఇంకా కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం పేర్కొన్నారు. హిల్ స్టేషన్లకు యాత్రలు చేస్తున్న ప్రజలు కోవిడ్ నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని అగర్వాల్ అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోవిడ్ నియంత్రణలో ఇప్పటివరకు సాధించిన విజయాలు మళ్లీ మొదటికి వస్తాయని ఆయన హెచ్చరించారు.
దేశంలో కోవిడ్ పాజిటివిటీ ఇప్పటికీ ఎక్కువగా ఉన్న 17 రాష్ట్రాలు మరియు యూటీలలోని పలు జిల్లాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అలర్ట్స్ జారీ అయ్యాయి. జూన్ 29 నుంచి జూలై మధ్యలో 10% కంటే ఎక్కువ కోవిడ్ పాజిటివిటీ రేటును నివేదించిన దేశవ్యాప్తంగా 73 జిల్లాలకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాలలో జనం గుమిగూడకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఆయా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో తెలపాల్సిందిగా సూచించింది.
ఇక, తెలంగాణలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క డోస్ కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు 62 శాతం మంది ఉన్నారు. థర్డ్ వేవ్ ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషనే కీలకం కానుంది. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే 82 శాతం వ్యాక్సిన్ జరగగా, చాలా జిల్లాల్లో అయితే ఇప్పటివరకు కేవలం 11 శాతం మాత్రమే జరగటం గమనార్హం.
ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,05,186 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 784 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1370మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,28,282కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 89 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 71, కరీంనగర్ నుంచి 51 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,703కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1,028 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,13,124 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,455 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.