TS's COVID Report: కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి యూరోపియన్ దేశాలలో 'గ్రీన్' సిగ్నల్; తెలంగాణలో కొత్తగా 858 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 12 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID-19 in India (Photo Credits: PTI)

Hyderabad, July 2:  దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి అదుపులోకి వస్తుంది. అయినప్పటికీ పలు దేశాల్లో భారత్ నుంచి ప్రయాణాలు చేసే వారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) భారత్‌ సహా 14 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. జూలై 21 వరకు ట్రావెల్‌ బ్యాన్‌ నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మరోవైపు, యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం కరోనా టీకాలు తీసుకున్న వారికి గ్రీన్‌పాస్‌ స్కీమ్ అమలు చేస్తూ తమ దేశాలలోకి అనుమతిస్తున్నాయి. అయితే గ్రీన్‌పాస్‌ స్కీమ్ లిస్టులో భారత కోవిడ్ టీకాలైన కోవిషీల్డ్, కొవాగ్జిన్ లను చేర్చలేదు. ఐరోపా మెడిసన్స్‌ ఏజెన్సీ ధ్రువీకరించిన టీకాలు వేసుకున్న వారు మాత్రమే ఈ పథకం ద్వారా EUదేశాల్లో ఆంక్షలు లేకుండా ప్రయాణాలు చేసేందుకు అనుమతిచ్చింది.

ఇదే విషయమై భారత్ ఆయా దేశాలకు విజ్ఞప్తి చేసింది. తమ వ్యాక్సిన్లను గ్రీన్ స్కీమ్ జాబితాలో చేర్చాలని కోరింది. దీంతో కోవిషీల్డ్‌ టీకా వేసుకున్న భారతీయులు ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేకుండా తొమ్మిది ఐరోపా దేశాలకు ప్రయాణించే వెసులుబాటు కలిగింది. ఈ మేరకు ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, ఎస్తొనియా దేశాలు అంగీకరించాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రంలో సెకండ్ వేవ్ వ్యాప్తి భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,617 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 858 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 996 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,25,237కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 107 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  ఖమ్మం నుంచి 81,  నల్గొండ నుంచి 64 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 9 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,678కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 1,175 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,08,833 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,726 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే, మధుమేహం చికిత్సలో వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధం కోవిడ్ చికిత్సలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఓ ఫార్మా పరిశోధన బృందం చేపట్టిన అధ్యయయనంలో వెల్లడైంది. మధుమేహ నియంత్రణకు వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధం కోవిడ్‌-19 స్పైక్‌ ప్రొటీన్‌ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా సమర్థంగా అడ్డుకోవడం వీరు గుర్తించారు. కోవిడ్‌ బారిన పడితే ప్రాథమికంగా కనిపించే లక్షణాలైన శరీర కణజాలాల్లో వాపు, రక్తం గడ్డకట్టే సామర్థ్యం గణనీయంగా తగ్గడం తదితరాలను త్రీడీ మానవ వాస్కులర్‌ ఊపిరితిత్తుల నమూనాలో పరిశోధకులు గుర్తించారు.