Telangana: తెలంగాణలో కొత్తగా మరో 92 పాజిటివ్ కేసులు నమోదు;  కరోనావైరస్ పట్ల ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది.. ప్రజలూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి - సీఎం కేసీఆర్
Telangana CM KCR | Photo: CMO

Hyderabad, June 8:  తెలంగాణలో కొత్తగా మరో 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3,742‬ కు చేరుకుంది. సోమవారం మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 142 కు పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1742 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1858 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, సీఎం సమీక్ష ప్రకటన ఉన్న నేపథ్యంలో సోమవారం నాటి హెల్త్ బులెటిన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేయలేదు.

సీఎం కేసీఆర్ రివ్యూ

 

కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదని, చాలా తక్కువ మంది, అది కూడా ఇతర తీవ్రమైన జబ్బులున్న వారు మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకవాలని సూచించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్ ఉన్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై సీఎం సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు వైద్యశాఖకు చెందిన అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని ఈ సందర్భంగా వైద్యాధికారులు, నిపుణులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఆందోళన చెందకుండా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.