Hyderabad, June 30: ప్రతిరోజు కనీసం 900కు పైగా పాజిటివ్ కేసులు, ఇది తెలంగాణలో గత కొన్ని రోజులుగా కనబడుతున్న పరిస్థితి. మంగళవారం కూడా తెలంగాణలో మరో 945 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 16,339 కి చేరుకుంది.
ఇక ఎప్పట్లాగే హైదరాబాద్ కరోనా కేసుల్లో టాప్ గేర్లో దూసుకుపోతుంది. మంగళవారం నమోదైన కేసుల్లో కూడా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఇక నగరాన్ని అంటిపెట్టుకునే ఉండే రంగారెడ్డి జిల్లా నుంచి 29, మేడ్చల్ నుంచి 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సంగారెడ్డి నుంచి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా 21 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.
ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana's COVID Bulletin:
ఈరోజు మరో 7 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 260 కు పెరిగింది.
ఇదిలా ఉంటే, గత 24 గంటల్లో అత్యధికంగా మరో 1,712 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 7,294 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,785 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 3,457 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 88,563 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.