Hyderabad, June 29: తెలంగాణలో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 15,394 కు చేరుకుంది.
రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో 90 శాతం కేసులు హైదరాబాద్ నుంచే ఉంటున్నాయి. సోమవారం నమోదైన కేసుల్లో కూడా ఒక్క హైదరాబాద్ నుంచే 861 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. మొన్నటివరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సోకిన ఈ వైరస్, నేడు రాష్ట్ర హోంశాఖ మంత్రినీ విడిచిపెట్టలేదు. సోమవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో మహమూద్ అలీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
నిన్న రంగారెడ్డి జిల్లా నుంచి 40, మేడ్చల్ నుంచి 20 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ తరువాత సంగారెడ్డిలో 14, మంచిర్యాలలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి.
ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
నిన్న మరో ఆరుగురు కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 253 కు పెరిగింది.
ఇదిలా ఉంటే, గత 24 గంటల్లో మరో 410 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,582 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,559 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 2,648 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 85,106 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.