Hyderabad, June 28: తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినప్పటికీ వ్యాప్తి ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభంపై సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా 1వ తరగతి నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. అంటే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు నేరుగా వెళ్లి హాజరు కావాల్సిన అవసరం లేదు. దూరదర్శన్ మరియు టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్ తరగతులు ప్రసారం చేయబడతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా పేర్కొన్నారు.
అలాగే ప్రైవేటు విద్యాసంస్థలు ఈ ఏడాది కూడా జీఓ 46 ను అమలు చేయాల్సి ఉంటుందని, అంటే వారు ఫీజులు పెంచకూడదని, నెలవారీ ప్రాతిపదికన ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,12,982 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 993 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 983 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,21,606కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 124 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, నల్గొండ నుంచి 78, సూర్యాపేట నుంచి 72 మరియు భద్రాద్రి కొత్తగూడెం నుంచి 58 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 9 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,644కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 1417 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,04,093 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.