Hyderabad, July 3: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 1892 మంది కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఇప్పటివరకు ఒకరోజులో నమోదైన మొత్తం కేసుల్లో ఇదే అత్యధికమైన సంఖ్య. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 20,462 కి చేరుకుంది.
హైదరాబాద్ నగరంలో కరోనా పంజా విసిరిసింది. జీహెచ్ఎంసీ పరిధి నుంచి ఒక్కరోజులోనే ఏకంగా 1658 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. గ్రేటర్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో చెప్పటానికి ఈ సంఖ్యే నిదర్శనం.
ముంబై మాదిరిగానే హైదరాబాద్ నగరంలో కూడా కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు తక్కువగా నిర్వహిస్తున్నారని, పాజిటివ్ కేసుల లెక్కల్లో కూడా తేడాలుంటున్నాయని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొన్నిసార్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రతీరోజు విడుదల చేయాల్సిన హెల్త్ బులెటిన్ జాప్యం చేస్తుండటం పట్ల ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి.
హైదరాబాద్ కు ఆనుకుని ఉండే రంగారెడ్డి నుంచి 56, మేడ్చల్ నుంచి 44, సంగారెడ్డి నుంచి 20 కేసులు రాగా, అటు వరంగల్ రూరల్ నుంచి ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితులను బట్టి చూస్తే వరంగల్ రూరల్ కరోనాకు కొత్త హాట్‌స్పాట్ గా మారిందా? ఈ ప్రాంతంలో కమ్యూనిటీ వ్యాప్తి ఏమైనా జరుగుతుందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana's COVID Bulletin:
కేసుల సంఖ్య అలా ఉంచితే గత 24 గంటల్లో మరో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 283 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో పెద్ద మొత్తంలో మరో 1,126 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆయన కొన్నిరోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 10,195 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,984 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గత 24 గంటల్లో 5,965 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,04,118 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.