
Hyderabad, April 27: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మహమ్మారి వైరస్ మాత్రం జెట్ స్పీడ్‌లో వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా రోజూవారీ పాజిటివ్ కేసులు 10 వేల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 99,638 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 10,122 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం ఇంకా 5,474 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,11,905కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,440 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 751 కేసులు, రంగారెడ్డి నుంచి 621,
వరంగల్ అర్బన్ నుంచి 653 మరియు నిజామాబాద్ నుంచి 498 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 52 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,094కు పెరిగింది.
అలాగే సోమవారం సాయంత్రం వరకు మరో 6,446 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,40,590 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,221 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 53 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా విజృంభన నేపథ్యంలో చాలా చోట్ల ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్రకు రాష్ట్ర హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. గౌలిగూడ నుంచి తాడ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు సాగే ఈ శోభయాత్రలో 21 మంది మించకూడదని, ర్యాలీలో బైక్ ల మీద ఒకరి కంటే ఎక్కువ వెళ్లకూడదు అలాగే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైకోర్ట్ సూచించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే శోభయాత్ర పూర్తవ్వాలని, దీనికి సంబంధించిన పూర్తి వీడియో తీయాలని అధికారులకు హైకోర్ట్ ఆదేశించింది.
అలాగే ఈవాళ టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.