LB Nagar, June 2: హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం మన్సురాబాద్ నుంచి ఎల్బీ నగర్ రూట్‌లోకారు డ్రైవర్ నడిరోడ్డులో కారు ఆపాడు. ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్ సీట్‌లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారుడోర్‌కు తగిలింది. దీంతో ఆ బైక్‌పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. దీంతో రోడ్డుపై ఉన్న రాయి బలంగా తగలడంతో చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి శశిరేఖ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
మృతి చెందిన చిన్నారిని ధనలక్ష్మి(2)గా గుర్తించారు పోలీసులు. చిన్నారి తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె భర్త గాయాలతో బయటపడినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్‌లో చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద స్థలంలో ఇప్పటికీ రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు.