Hyd, Nov 29: ఓయూ క్యాంపస్‌లో వాకింగ్ కోసం వచ్చే బయటి వారినుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనివర్సిటీ (Osmania University) తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ మరియు యోగా వంటి ఫిట్‌నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు. అయితే వాకర్స్‌కు యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్‌లో (OU Campus in Hyderabad) వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను (Rs 200 Per Month For Walking) వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం క్యాంపస్‌లో స్విమింగ్‌పూల్, క్రికెట్ గ్రౌండ్ వాడుకునే వారి నుంచి యూజర్ చార్జీలు వసులు చేస్తున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, రాంచందర్‌రావు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థల యజమానులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ తదితరులు వాకింగ్‌కు వస్తారు. వీరి భద్రత కూడ యూనివర్సిటీ చూసుకోవలసి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వ్యక్తులు కూడా క్యాంపస్‌లో తిరుగుతుంటారు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకునే అవకాశం లేదు. అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది.
బయటి వ్యక్తులు క్యాంపస్‌లోని వసతులను ఉచితంగా వాడుకోవడం వల్ల వాటి విలువ తెలియడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరిస్థితితులకు అనుకూలంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపట్టలేమన్నారు. కొంతమంది క్యాంపస్‌కు పెంపుడు కుక్కలను తీసుకొచ్చి ఇక్కడే మలమూత్ర విసర్జన చేయించడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు. అంతేకాక చుట్టుపక్కల నివాసముండేవారు తమ కార్లను ఈ స్థలాన్ని పార్కింగ్‌స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. రాత్రి వేళ అయితే క్రీడా మైదానాల్లో మద్యం తాగి..ఖాళీ సీసాలను పగులగొట్టి అలాగే వదలివేస్తారు.