Hyderabad, November 16: ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) నేటితో 43వ రోజుకు చేరుకుంది, ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఉద్యమకార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్ రోకో, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఉదయం నుంచే ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నాకు దిగారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఎవరికీ, ఎక్కడా ఎలాంటి దీక్షలకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎవరూ దీక్షలు చేపట్టకుండా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
నేడు నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్, ఎల్బీ నగర్ లోని హస్తినాపురం కాలనీలో గల ఆయన ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అశ్వత్థామ రెడ్డి మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అశ్వత్థామ రెడ్డి తన ఇంట్లోనే దీక్షకు కూర్చున్నారు. తాము విలీనంపై వెనక్కి తగ్గినా సీఎం కేసీఆర్ (CM KCR) పట్టించుకోవడం లేదు, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె పూర్తిగా సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఇలా అయితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ సమ్మె అర్థాంతరంగా ముగించినా, వారికి ప్రభుత్వం నుంచి పిలుపు డౌటే?
మరోవైపు సీపీఐ నేత నారాయణ ఆర్టీసీ నేతల అరెస్టులను ఖండించారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని ఆయన హితవు తెలిపారు, ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలని నారాయణ డిమాండ్ చేశారు.