Hyderabad, Mar 23: తెలంగాణ రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు (Telangana Schools Closed)అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత, విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఆ తర్వాత మంత్రి సబిత ఇంద్రారెడ్డి (minister sabitha indra reddy) శాసనసభలో ప్రకటన చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మరో మారు కరోనావైరస్ వ్యాప్తి చెందుతుంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మన రాష్ర్టంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుముదురుగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, పంజాబ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌తో పాటు తదితర రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేశాయని తెలిపారు.
Here's Educational Minister Statement
#JUSTIN: #Telangana Education Minister @SabithaindraTRS has announced that Govt has taken a decision to close educational institutions in view of the rising #COVID cases and the health of Teachers and students. @NewsMeter_In pic.twitter.com/9Cg3KeLmHV
— @CoreenaSuares (@CoreenaSuares2) March 23, 2021
మన రాష్ర్టంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు రాష్ర్టంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపట్నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి.. రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్‌లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు రాష్ర్ట ప్రజలందరూ సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.
తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు, సిబ్బందితో కలిపి 146 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 21 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 8 మంది విద్యార్థులు కాగా, 13 మంది సిబ్బంది ఉన్నారు.
సిబ్బందిలో 10 మంది ఉపాధ్యాయులు కాగా, ఒక వంట మనిషి, వాచ్ మన్, డ్రైవర్ ఉన్నారు. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్ కు తరలించనున్నారు. కాలేజీలో కరోనా కలకలం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.