Central Teams Inspecting Gachibowli TIMS in Hyderabad. | Photo; IPRD Telangana.

Hyderabad, April 25: తెలంగాణలో కరోనావైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. గత నాలుగు రోజులుగా పదుల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 7 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య శనివారం సాయంత్రం నాటికి 990కి చేరింది. శనివారం నమోదైన మొత్తం 7 కేసుల్లో 6 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండగా, వరంగల్ అర్బన్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఈరోజు కరోనా మరణాలేమీ నమోదు కాకపోవడంతో మరణాల సంఖ్య 25 గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

కాగా, ఈరోజు మరో 16 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 307 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 658 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి దాటిన కోవిడ్-19 కేసులు, శ్రీకాకుళం జిల్లాకూ సోకిన కరోనావైరస్ 

మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి సీరియస్‌గా ఉందని దేశంలోని అతిపెద్ద హాట్‌స్పాట్ జోన్‌లైన లేదా అవతరిస్తున్న హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ ఉల్లంఘనలు జరిగి వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు కేంద్రానికి సమాచారం అందటంతో కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు ఆయా నగరాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.

ఇందులో భాగంగా కేంద్ర బృందం శనివారం హైదరాబాద్‌ చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే గచ్చిబౌలి స్పోర్ట్‌ విలేజ్‌ కాంప్లెక్స్‌ భవనంలో ఏర్పాటు చేసిన అధునాతన కోవిడ్‌–19 ఆస్పత్రి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌(టిమ్స్‌) ను, ఆస్పత్రిలోని సదుపాయాలను కేంద్ర బృందం పరిశీలించింది. మూడు రోజుల పాటు ఈ బృందం హైదరాబాద్‌లోనే ఉండనుంది.