Hyd, Nov 10: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ ప్రియుడు (Telangana Shocker) తన ప్రియురాలిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని కే కే నగర్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లికి చెందిన గొడుగు అంజలి (20) తల్లి లక్ష్మితో కలిసి నివసిస్తోంది. యైటింక్లయిన్‌కాలనీలోని తారకరామానగర్‌కు చెందిన చాట్ల రాజు ట్రాక్టర్ కూలీ గా పనిచేస్తున్నారు. తల్లి కూలిపనికి వెళ్లిన తర్వాత అంజలి ఇంట్లో ఒంటరిగా ఉంటుండడాన్ని గమనించిన చాట్ల రాజు (20) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.
తనను పెళ్లి చేసుకోవాలని రాజు.. అంజలిపై గత కొద్ది రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందామని అంజలి రాజుకు సర్దిచెప్పింది. దీంతో రాజు ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక తన ఇంటికి రావొద్దని (declining love proposal) అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయమై ఏడాది క్రితం ఇరు కుటుంబాల మధ్య పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇద్దరి సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అభ్యంతరం తెలిపారు.
అంజలికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకున్న రాజు ఆమెపై కసి పెంచుకున్నాడు. నిన్న మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. వారి కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు (Jilted lover kills 18-yr-old girl ) కోశాడు. ఆపై ఇంట్లోని కత్తిపీటతో ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అంజలి తల్లి లక్ష్మితో కలిసి పనిచేసే వ్యక్తి ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇచ్చేందుకు నిన్న మధ్యాహ్నం వారింటికి వెళ్లాడు. ఎంతగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడం, టీవీ సౌండ్ పెద్దగా ఉండడంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో పడివున్న అంజలి మృతదేహాన్ని చూసి భయంతో వణికిపోయాడు. తేరుకుని బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. సమాచారం అందుకున్నపెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
తనకు దక్కని అంజలి మరోవ్యక్తికి దక్కకూడదనే ఉద్దేశంతోనే రాజు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. అంజలి తండ్రి కొన్నాళ్ల క్రితమే చనిపోగా.. కుటుంబం ఆలనాపాలనా తల్లి లక్ష్మి చూసుకుంటోంది. కూతురు ఇలా హత్యకు గురికావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నిందితుడు రాజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే రాజు లొంగిపోయినట్టుగానీ, అరెస్టు చేసినట్టుగానీ పోలీసులు ధ్రువీకరించలేదు.