Hyd, Dec 10: తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ వివాహిత మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య (married woman committed suicide) చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో జరిగింది. స్థానికుల తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వాకిటి నర్సిరెడ్డి– సునీత(38) దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వీరు వ్యవసాయం (Agriculture) చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే భర్త నర్సిరెడ్డి ఏడాదిగా ఓ మహిళతో వివాహేతర సంబంధం (extra-marital affair ) కొనసాగిస్తున్నాడని సునీత గొడవ పడుతుండేది. ఈ విషయంలో గురువారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. నర్సిరెడ్డి వ్యవసాయ బావివద్దకు వెళ్లాక భర్త ప్రవర్తనలో మార్పు రావడం లేదని జీవితంపై విరక్తి చెందిన సునీత ఇంట్లో దూలానికి ఉరివేసుకుంది. సాయంత్రం భర్త ఇంటికి రాగా తలుపులు గడియ వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా సునీత దూలానికి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. నర్సిరెడ్డి రోదిస్తుండటంతో స్థానికులు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి బంధువులు ఘటన స్థలికి చేరుకుని ఆందోళన చేశారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తమ కూతురును నర్సిరెడ్డి పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ఎస్సై రాజేష్‌నాయక్ వారికి నచ్చజెప్పారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ మార్చురీకి తరలించారు.