
Nalgonda, August 23: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చిన్నకూతురు పేర అదనంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిందనే అక్కసుతో తన తల్లిపై కుమారుడు, కోడలు దాడి (Son and Daughter-in-law Attacked on Woman) చేసి గాయపరిచారు. జిల్లాలోని నిడమనూరు మండలంలోని పార్వతీపురంలో ఆదివారం చోటుచేసుకుంది. నిడమనూరు ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పార్వతీపురంలో ఇట్టె కిష్టమ్మ, కోటయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరికి ఉన్న భూమిలో పెద్దకుమారుడికి, చిన్న కుమారుడికి తలా కొంత భూమిని పంచి ఇచ్చి, మిగతాది తమపేరున ఉంచుకున్నారు. ఇదిలా ఉండగా చిన్నకూతురు అయిన విజయలక్ష్మి పేర కట్నకానుకగా ఇచ్చిన భూమికి అదనంగా రిజిస్ట్రేషన్ చేసిందని పెద్దకుమారుడు అయిన సూరిబాబు అప్పుడప్పుడు తల్లితో గొడవపడుతూ (property Dispute) ఉండేవాడు. తల్లి కిష్టమ్మ ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఇంట్లో పని చేసుకుంటుండగా పెద్ద కుమారుడు, అతడి భార్య భూలక్ష్మి, వారి కూతుళ్లు వచ్చి భూమి విషయంలో కిష్టమ్మతో గొడవపడ్డారు. కొడవలి, రాడ్డుతో తీవ్రంగా కొట్టారు. దీంతో వృద్ధురాలి తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి కుమార్తె మాణిక్యాల విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు. కాగా.. ఇట్టె కిష్టమ్మపై 2019లో కూడా కుమారుడు ఇట్టె సూరిబాబు బీరు సీసాతో దాడి చేసి గాయపర్చాడు. కోలుకున్న తర్వాత తిరిగి రెండేళ్లకు సూరిబాబుతో పాటు అతడి భార్య, ఇద్దరు కూతుర్లు దాడి చేయడం గమనార్హం.