Hyd, May 9: తెలంగాణలోని సిద్దిపేటలో దారుణం (Telangana Shocker) చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి పెళ్లయిన 35 రోజులకే కట్టుకున్న భర్తను చంపేసింది ఓ ఇల్లాలు. ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరో వ్యక్తితో పెళ్లి చేయడంతో అతన్ని చంపేందుకు (Woman Kills Husband for Lover in Siddipet) పథకం రచించి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)తో మార్చి 23న పెళ్లి జరిగింది. చంద్రశేఖర్ వ్యవసాయం చేస్తున్నాడు. అయితే చిన్నప్పటి నుంచి స్నేహితులైన గుడికందులకు చెందిన శివ కుమార్, శ్యామల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇష్టంలేని పెళ్లి చేశారని, తన భర్తతో సుఖంగా ఉండట్లేదని, భర్తను అడ్డు తొలగిస్తే శివతో సంతోషంగా ఉండొచ్చు అని శ్యామల భావించింది.చంద్రశేఖర్‌ను చంపడానికి శివ సాయం కోరింది. అతను చెప్పినట్టు చంద్రశేఖర్ తినే ఆహారంలో ఏప్రిల్ 19న ఎలుకల మందు కలిపి పెట్టింది. అది తిన్న చంద్రశేఖర్‌కు అనారోగ్య సమస్యలు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ 22న ఇంటికి వచ్చాడు.
తొలి ప్రయత్నం విఫలం కావడంతో భర్తను ఎలాగైనా చంపాలని శ్యామల మరోసారి శివ సాయం కోరింది. గుడికందులకు చెందిన ఇద్దరు స్నేహితులు రాకేశ్, రంజిత్, శివకు చిన్నమ్మ కొడుకైన సిరిసిల్లకు చెందిన భార్గవ్, మరో బంధువు సాయికృష్ణతో కలిసి ప్రణాళిక వేసింది. చిన్నకోడూర్ మండలం అనంతసాగర్‌లోని సరస్వతీ ఆలయంలో మొక్కు ఉందని చెప్పిన శ్యామల.. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏప్రిల్ 28న అనంతసాగర్‌కు బయలుదేరింది. మాయ మాటలు చెప్పి అనంతసాగర్ శివారులోని ధన్వంతరి అగ్రహారానికి వెళ్లే మట్టి దారిలోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ కారులో మాటు వేసిన శివ, నలుగురు యవకులు చంద్రశేఖర్‌పై దాడి చేసి తువాలతో మెడ చుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
చంద్రశేఖర్ మృతదేహాన్ని కారులో సిద్దిపేట శివారుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో శ్యామల భర్తకు ఛాతీలో నొప్పి వస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని చంద్రశేఖర్ కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పింది. 108కి సమాచారం అందించి వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపింది. కుటుంబీకులు వచ్చేసరికి చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి మనెవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత నెల 28న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్యామలపై అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా శివతో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం తెలిపింది. దీంతో పోలీసులు శ్యామల, శివ, మరో నలుగురిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.