Sircilla, Oct 29: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో తండ్రిని బండరాయితో తనయుడు కొట్టి చంపిన (Son kills father) ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలం పద్మానగర్ చోటుచేసుకుంది.
దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని (Rajanna Sircilla) పద్మానగర్‌కు చెందిన దూస ఆంజనేయులు (65) కు భార్య లలిత, నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో ముగ్గురు కూతుర్లకు, కొడుకులకు వివాహం జరిగింది. చిన్న కూతురుకు వివాహం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పెద్ద కొడుకు శ్రీనివాస్ తో గత కొంతకాలంగా ఆస్తి పంపకాలపై వివాదం జరుగుతోంది. గ్రామ పెద్దల సమక్షంలో కొడుకులు ఇద్దరితో పాటు తల్లిదండ్రులకు కలిపి మూడు భాగాలుగా ఆస్తిని విభజించారు.
దీనికి ఒప్పుకొని శ్రీనివాస్, రెండు భాగాలుగా పంపకాలు జరపాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. రెండు భాగాలుగా పంపకాలు జరపకపోతే కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో కొడుకు శ్రీనివాస్ కు భయపడి రెండు సంవత్సరాలుగా తల్లిదండ్రులు, పెద్ద కూతురుతో కలిసి వేములవాడలో ఉంటున్నారు. ఇటీవల శ్రీనివాస్ పద్మానగర్ లోని ఇంటిలో ఉంటూ గోడను కూల్చివేసిన తన భాగంలో ఉంటానని ఇంట్లోకి చేరాడు.
విషయం తెలుసుకున్న తండ్రి ఆంజనేయులు ఈనెల 28న పద్మ నగర్ కు చేరుకున్నాడు. అయితే రాత్రి వరకు కొడుకు శ్రీనివాస్ తో కలిసి ఉన్న ఆంజనేయులు, వేములవాడలో కూతరు ఇంటికి చేరలేదు. శుక్రవారం ఉదయం ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న ఆంజనేయులు చూసిన స్థానికులు పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.గత కొంత కాలంగా బెదిరిస్తున్న తన కొడుకు శ్రీనివాస్ తండ్రిని చంపి ఉంటాడని పోలీసులకు ఆంజనేయులు భార్య లలిత ఫిర్యాదు చేసింది. కాగా శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.