
Hyderabad, March 22: తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, దాదాపు అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ వ్యాప్తి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు కరోనా బారినతుండం పట్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం గత వారం రోజుల్లోనే 200పైగా విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలను మూసి వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అధికారులు నివేదిక పంపిన తర్వాత సీఎం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే రాష్ట్రంలో కేసులు పెరగటం, విద్యార్థులు కరోనా బారినపడటం రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ తెలిపారు. అయితే కోవిడ్19 పిల్లలపై పెద్దగా ప్రభావం చూపబోదని అని ఆయన అన్నారు, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ చాలా మంది పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులందరికీ కోవిడ్ -19 కిట్లు ఇచ్చి, ఇంట్లో ఒంటరిగా ఉండాలని సలహా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఇక, రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదయిన కోవిడ్ కేసుల గణాంకాలను పరిశీలిస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 37,079 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 337 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 404 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,03,455కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 91 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 37 కేసులు, మేడ్చల్ నుంచి 28 మరియు నిర్మల్ జిల్లా నుంచి 18 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,671కు పెరిగింది.
అలాగే ఆదివారం సాయంత్రం వరకు మరో 181 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,98,826 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,958 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లలతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,43,921 మందికి టీకా పంపిణీ జరిగినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.