Hyd, Dec 16: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 5 గంటలకుపైగా కేబినెట్ భేటీ జరిగింది.ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దాదాపు 50 లక్షలకు పైగా భూమి లేని కుటుంబాలు ఉండగా వారికి సంవత్సరానికి రూ.12,000 వేలు చొప్పున రెండు విడతల్లో ఇవ్వనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇక కేటీఆర్ ఈ-ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
హైదరాబాద్‌లో కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గవర్నర్ అనుమతిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో చర్చించాం. కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను. చట్టం తన పని తాను చేస్తుంది. బాంబు తుస్సుమందని ఇటీవల భారాస నేతలు వ్యాఖ్యానించారు. అది తుస్సుమనేదైతే.. దిల్లీ చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేశారు? అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లా కాకుండా గూండాల్లా ప్రవర్తించారు. మాట్లాడటానికి అంశం లేనందుకే ప్లకార్డులు, నినాదాలతో సభకు ఆటంకం కలిగించారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెడతాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు. ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నాం’’ అని తెలిపారు.