Weather Forecast: తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, చలితో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న రాష్ట్రం, రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి జల్లులు
Cold Wave, representational image. (Photo Credits:IANS)

Hyderabad, December 31: ఉత్తర భారతదేశం, ఈశాన్యం నుంచి వీస్తున్న చల్లని గాలుల (north-easterly winds)  ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత రెండు రోజుల కంటే మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు చోట్ల చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్నోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పటాన్ చెరు, బొల్లారం, కాప్రా, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతున్నాయి.

నగరంలో మంగళవారం ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉన్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, అంబర్‌పేట్, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు అంచనా వేస్తున్నాయి. చలి దెబ్బకు వణుకుతున్న ఉత్తర భారతం, చలి గుప్పిట్లో చిక్కుకుపోయిన దేశ రాజధాని

ఈశాన్యం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉందనుకుంటుండగా, ఆఖరుకు వచ్చేసరికి చలితోనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది రాష్ట్రం.