Image of Drone | Photo: Wikimedia Commons

Hyderabad, September 9: కరోనా లాక్డౌన్ మనుషుల మధ్య దూరాన్ని పెంచగా, కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఆద్యంపోసింది. ఇందులో భాగంగా నేరుగా ఇంటి వద్దకే ఔషధాలు , వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం డ్రోన్ డెలివరీ ట్రయల్స్ గురువారం నుండి తెలంగాణలోని హైదరాబాద్‌, వికారాబాద్ లలో ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 17 వరకు ట్రయల్స్ కొనసాగుతాయి. ఈ ట్రయల్స్ నిర్వహించడం కోసం డ్రోన్ ఆధారిత డెలివరీ విమానాలను అందించడానికి 'స్కై ఎయిర్' అనే సంస్థ ప్రముఖ కొరియర్ సర్వీస్ అయిన 'బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్‌'తో చేతులు కలిపింది. డ్రోన్ ఆధారిత లాజిస్టిక్ రవాణా వ్యవస్థ అభివృద్ధిపరిచే దిశగా ఈ సంస్థలు దృష్టిపెడుతున్నాయి. సుమారు 9 -10 కి.మీ దూరాలకు డెలివరీ చేసేందుకు ఈ డ్రోన్లు వాడనున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే, దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల డెలివరీ కోసం డ్రోన్ విమానాలను ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది.

తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తోంది. MFTS ప్రాజెక్ట్ యొక్క మొదటి రెండు రోజుల ట్రయల్స్ 'విజువల్ లైన్ ఆఫ్ ఫ్లయింగ్‌'లో ఎగురుతాయి అంటే డ్రోన్‌లు బేస్ నుండి 500 నుండి 700 మీటర్ల మధ్య ఎగురుతాయి.  వాటిని కంటితో చూడవచ్చు. ఈ డ్రోన్లు వ్యాక్సిన్లను, ఔషధాలు మరియు మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌ను మోసుకొని వెళ్తాయి.

ఇదిలాఉంటే, తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. ఇప్పటివరకు సుమారుగా 2 కోట్ల మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ పొందినట్లు ఆరోగ్యశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ఇక కరోనా కేసుల విషయానికి వస్తే, తెలంగాణలో బుధవారం 329 కోవిడ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ఒకరు చనిపోయారు. అలాగే 307 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,497 ఆక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.