TRS organises innovative protest on Paddy issue (Photo-Twitter)

Hyd, April 7: తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు (TRS organises innovative protest) కొనసాగుతున్నాయి. కాగా, రైతుల ఆందోళనలకు మద్దతుగా ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో మోకాళ్లపై కూర్చొని వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వడ్లు కొనుగోలు (Paddy issue) చేసేంత వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్‌.. నిన్న రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారులను (TRS protests on highways) దిగ్భందించింది.

నేడు అన్ని జిల్లాల్లో రైతు మహాధర్నాలను చేపట్టింది. టీఆ‌ర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి‌డెంట్ కేటీఆర్‌ పిలు‌పు‌ మేరకు రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనల్లో ( TRS hold five-pronged protest) పాల్గొంటున్నారు. కేంద్రంలోని మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కేంద్రం వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని నినదించారు. ఈ ఆందోళనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగిస్తున్నారు.

రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు హౌస్ అరెస్ట్, పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను అవ‌మానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చాయ్ పే చ‌ర్చ అని అధికారంలోకి వ‌చ్చిన బీజేపీని త‌రిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నూక‌లు తిన‌డం అల‌వాటు చేయాల‌ని నోరు పారేసుకున్న‌ గోయ‌ల్‌కు ఎంత బ‌లుపు, కండ‌కావ‌రం అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రిని నిర‌సిస్తూ రాజ‌న్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Here's Protest Updates

బీజేపీ పార్టీకి చెందిన గ‌ల్లీ నాయ‌కులు ఒక మాట‌, ఢిల్లీ నాయ‌కులు ఒక మాట మాట్లాడి రైతుల్లో అయోమ‌యాన్ని సృష్టించారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో ఎవ‌రిది తెలివి త‌క్కువ‌త‌నం.. మీ కేంద్రానిదా? తెలంగాణ రైతుల‌దా? అని కేటీఆర్ నిల‌దీశారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని త‌రిమికొట్ట‌డం ఖాయమ‌న్నారు. నూక‌లు తిన‌మ‌ని చెప్పిన పార్టీకి తోక‌లు క‌త్తిరించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎండ‌కాలంలో మ‌నం పండించే వ‌రి పంట‌ను కొనాల‌ని అడిగితే.. కేంద్రం నుంచి ఉలుకు ప‌లుకు లేదు. మీ బియ్యం తిన‌మ‌ని పీయూష్ గోయ‌ల్ అంటున్నాడు. నూక‌లు తిన‌డం నేర్పించండ‌ని వెట‌కారంగా మాట్లాడిండు. మంత్రుల‌ను మీకేం ప‌నిలేదా అని అవ‌మాన‌ప‌రిచిండు. ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేద‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్న‌డు.

సంవ‌త్స‌రానికి కోటి మెట్రిక్ ట‌న్నుల పైచిలుకు ఉప్పుడు బియ్యాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా 80 నుంచి 90 దేశాల‌కు కేంద్రం ఎగుమ‌తి చేస్తున్న‌ది. కానీ పీయూష్ గోయ‌ల్ సిగ్గు, లజ్జ లేకుండా అబ‌ద్ధాలు చెబుతూ.. ఉప్పుడు బియ్యం కొన‌డం లేద‌ని చెప్తుండు. విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా కేంద్ర‌మంత్రి మాట్లాడుతుండు. యాసంగిలో వరి సాగు చేయమని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టాడు.. కేంద్రాన్ని ఒప్పించి ప్ర‌తి గింజ‌ను కొంటామ‌ని చెప్పిండు. కానీ ఇప్పుడేమో ముఖం చాటేశాడు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కూడా అబద్ధాలు చెప్పాడు. రా రైస్, బాయిల్డ్ రైస్‌ను కేంద్రతో కొనిపిస్తామని కిషన్ రెడ్డి చెప్పాడు.. ఆయ‌న కూడా ప‌త్తా లేడని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్య‌త కేంద్రానికి లేదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? అని మోడీ స‌ర్కారును మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో పండిన ప్ర‌తిగింజ‌నూ కొనుగోలుచేయాల‌ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌ మంజుశ్రీరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు ఎర్రోల్ల శ్రీనివాస్, దేవిప్ర‌సాద్‌తో క‌లిసి సంగారెడ్డిలో గురువారం నిర్వ‌హించిన నిర‌స‌న‌దీక్ష‌లో త‌ల‌సాని పాల్గొన్నారు.

కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ పిలుపు మేరకు యాసంగి వడ్లు కొనాలని డిమాండ్‌ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, పార్టీ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. వెంటనే కేంద్రం దిగివచ్చిన వడ్లు కొనుగోలు చేయాలని, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపై వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని. ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి బీజేపీ ప్రభుత్వ రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.

నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామ‌ని..నేడు తెలంగాణ రైతుల‌కోసం మ‌ళ్లీ రోడ్డెక్కామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మోడీ స‌ర్కారు తొండాట ఆడుతున్న‌ద‌ని, రైతుల‌ను రోడ్డుపైకి తెచ్చింద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద 10 వేల మందితో నిర‌స‌న‌దీక్ష చేప‌ట్టారు.

తెలంగాణ రైతుల‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌నివ్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధాన్యం సేకరణ విష‌యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో చేప‌ట్టిన టీఆర్ఎస్ నిర‌స‌న దీక్ష‌లో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా రైతుల పక్షాన పోరాడుతామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో మంత్రి జిల్లా కేంద్రంలోని మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న దీక్షలో పాల్గొన్నారు.

కేంద్రం చక్రవర్తి కాదు..రాష్ట్రాలు సామంతులు కాదు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని వ్యవవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. తెలంగాణ రైతుల శాపం ఊరికే పోదు. తెలంగాణ పై వివక్షను కొనసాగిస్తున్నదని మంత్రి మండిపడ్డారు.