Hyd, Jan 7: ట్యూషన్ పేరుతో అభం శుభం తెలియని 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ కీచక టీచర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష (Tutor, hostel manager) పడింది. అలాగే సంస్థ నిర్వాహకుడికి కూడా యావజ్జీవ శిక్ష విధించారు. ఇక ఈ నేరాన్ని (Rape of 12 minor girls in Nalgonda) దాచిన ఓ మహిళకు ఆర్లెళ్ల జైలు శిక్షను విధిస్తూ నల్లగొండ జిల్లా ఒకటో అదనపు సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాల్లోకెళితే... నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఏనమీది తండాలో నానం శ్రీనివాసరావు, నానం సరితలు 1996 సంవత్సరంలో విలేజ్ రీ కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్(వీఆర్వో) పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ తరఫున ఓ పాఠశాలను నెలకొల్పి.. గిరిజన విద్యార్థునులకు విద్యను బోధించేవారు. ఇందుకోసం స్థానికుడైన రమావత్ హరీశ్‌నాయక్ అనే వ్యక్తిని ట్యూషన్ చెప్పేందుకు టీచర్‌గా నియమించారు. హరీశ్ తన వద్ద చదువుకునే బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే 12 మంది బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2014 జనవరి 3న వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ ఘటన అసెంబ్లీని సైతం కుదిపేసింది.
దీంతో అప్పటి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. అప్పటి మిర్యాలగూడ డీఎస్పీ(ప్రస్తుతం ఖమ్మం అదనపు ఎస్పీ) సుభాష్ చంద్రబోస్, హాలియా సీఐ(ప్రస్తుతం దేవరకొండ డీఎస్పీ) ఆనంద్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్(ప్రస్తుతం ఏఎస్సై) వెంకట్‌రెడ్డి ఈ కేసును ఛేదించి, హరీశ్‌నాయక్, శ్రీనివాసరావు, సరితను అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 417, 420, 506, 109, 202, 354/ఏ, 376 సెక్షన్లు, పోక్సో చట్టం కింద మొత్తం 11 కేసులు నమోదు చేశారు. అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో చార్జిషీట్ దాఖలు చేసి కోర్టుకు పక్కా ఆధారాలను సమర్పించారు.
బాధితుల పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరిగిరి వెంకట్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న ఒకటో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి నాగరాజు గురువారం తుది తీర్పును వెలువరించారు. హరీశ్‌నాయక్, శ్రీనివాసరావుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు.. చెరో పదివేల జరిమానా, సరితకు ఆర్నెల్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానాను విధించారు. ఈ తీర్పును బాధిత కుటుంబాలు, మహిళా సంఘాలు స్వాగతించాయి. ఏనమీది తండావాసులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు నిందితులను నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. కాగా.. సరితకు ఈ కేసులో బెయిల్ లభించింది