Hyderabad, May 4: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1082కు చేరింది. ఎప్పట్లాగే హైదరాబాద్ వైరస్‌కు హాట్‌స్పాట్‌గా కొనసాగుతోంది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 20 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా జిల్లాల నుంచి ఎలాంటి కేసులు లేవనుకుంటున్న తరుణంలో జగిత్యాల జిల్లా నుంచి మరో కేసు నమోదవడం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. ఆరెంజ్ జోన్ పరిధిలో ఉన్న జగిత్యాలలో కేసులు '0' చేరుకున్నాయని ఇటీవలే రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంతలోనే మరో కొత్త కేసు వచ్చి చేరడంతో జిల్లాలో మళ్లీ టెన్షన్ మొదలైంది.
అయితే ఒకవైపు కేసులు పెరుగుతూ ఉన్నా, మరోవైపు అంతకుమించిన సంఖ్యలో బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుండటం కొంత ఊరట కలిగించే విషయం. ఈ రకంగా రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతుంది. ఆదివారం మరో 46 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 545 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. కొత్తగా కరోనా మరణాలేమి నమోదు కాలేదు, దీంతో మరణాల సంఖ్య 29 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 508 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
#COVID19 in Telangana:
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం విధించిన రెండో దశ లాక్డౌన్ ఆదివారంతోనే పూర్తయింది, ఈరోజు నుంచి మే 17 వరకు మూడో దశ లాక్డౌన్ అమలులో ఉండనుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మే 7 వరకు కొనసాగుతుంది. అయితే కేంద్రం జారీ చేసిన మూడో దశ లాక్డౌన్ మార్గదర్శకాల అమలుపై సీఎం కేసీఆర్ నిన్న ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు రాష్ట్ర కేబినేట్ కూడా భేటీ కాబోతుంది, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ లాక్డౌన్ సడలింపులు ప్రకటిస్తారా? లేక మరింత కఠినంగా అమలు చేస్తారా? అన్నదానిపై రేపు కేబినేట్ భేటీ తర్వాత స్పష్టత రానుంది.