Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, June 10: తెలంగాణలో బుధవారం మరో 191  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,111 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,663 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 143 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత  మేడ్చల్ నుంచి 11, సంగారెడ్డి నుంచి 11, రంగారెడ్డి 8,  మహబూబ్ నగర్ 4, జగిత్యాల, మెదక్ జిల్లాల నుంచి 3 చొప్పున, అలాగే నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల నుంచి 2 చొప్పున నమోదు కాగా, నిజామాబాద్, వికారాబాద్, నల్లగొండ, సిద్ధిపేట  నుంచి  ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

బుధవారం మరో 8 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 156 కు పెరిగింది.

ఇదిలా ఉంటే ఈరోజు మరో 75 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1817 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2138 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న మెడికోల ధర్నా

మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ధర్నా కొనసాగుతోంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి చనిపోయాడంటూ మంగళవారం కోవిడ్ కారణంగా మృతిచెందిన వ్యక్తి  తరఫు బంధువులు గాంధీ ఆసుపత్రిలోకి వచ్చి వైద్యులపై దాడి చేశారు. దీంతో ఆ రాత్రి 8:30 నుంచి సుమారు 300 మంది జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నారు.

తమకు రక్షణ కల్పించాలని, దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ ను కలిసిన వైద్యుల బృందం తమ డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

కేవలం గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా ఇతర ఆసుపత్రుల్లో కూడా కరోనా పేషెంట్లకు చికిత్సను అందించాలి, ఇప్పుడున్న వైద్యులపై భారం తగ్గించి కొత్తగా మరింత మంది వైద్యులను నియమించాలి. వైద్యులపై దాడి చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారు అనే దానిపై విస్తృత ప్రచారం కల్పించాలి లాంటి డిమాండ్లను మంత్రి ముందు ఉంచినట్లు సమాచారం.