Telangana's Singareni calls for one-day strike ( photo-facebook)

Bhadradri,September 24:  సుదీర్ఘకాలం తరువాత సింగరేణి సంస్థ( Singareni Collieries Company)లో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను( Foreign Direct Investments (FDI)) వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు చేపడుతున్న ఈ సమ్మెకు.. సింగరేణి గుర్తింపు సంఘంతో సహా విప్లవ కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఒక్కరోజు సమ్మె కారణంగా, రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడి, సింగరేణి సంస్థకు రూ. 70 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అయితే వేతనాల్లో కొత పడినా.. సంస్థ మనుగడకోసం, హక్కుల భద్రత కోసం దేశ వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాల్సిన బాధ్యత.. ప్రతీ కార్మికునిపై ఉందని.. జాతీయ కార్మిక సంఘాటు సింగరేణి కార్మిక సంఘాలకు సూచిస్తున్నాయి.

జాతీయ కార్మిక సంఘాలు ( National trade unions AITUC) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టడంతో పలు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి ( Bhadradri)కొత్తగూడెం జిల్లాలోని గనులపై ఈ సమ్మె ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. ఉపరితల గనుల్లో పాక్షిక ప్రభావం కనిపిస్తోంది. జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్‌ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా రామగుండం ఆర్‌బీ 1, 2, 3 రీజియన్‌లోని ఏడు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే మందమర్రిలోని భూగర్భ, ఉపరితల గనుల్లో కార్మికులు కూడా సమ్మె బాటపట్టారు. సమ్మె కారణంగా రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి, సింగరేణి యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. విధులకు హాజరయ్యే కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ అరకొరగానే కార్మికులు విధులకు హాజరయినట్లు సమాచారం.

వారి డిమాండ్లును పరిశీలిస్తే..

బొగ్గు పరిశ్రమలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) పూర్తిగా నిలిపివేయాలి. అలాగే కోల్‌ ఇండియా మొత్తం విడదీయకుండా ఒకే కంపెనీగా ఉంచాలి. బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి. ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి. నిలుపుదల చేసిన రిక్రూట్‌మెంట్లను తిరిగి వెంటనే చేపట్టాలి. సింగరేణిలో ఉన్న ఖాళీలను ఇంటర్నల్‌ కార్మికులతో భర్తీ చేయాలి. లాభాల్లో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలి. కారుణ్య నియామకాలను కార్మికులందరికీ వర్తింపజేయాలి. హైకోర్టు తీర్పు ప్రకారం రెండు సంవత్సరాలలోపు సర్వీస్‌ ఉన్న కార్మికులు అన్‌ఫిట్‌ అయినా వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలి.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత

సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె ప్రకటించడంతో బొగ్గు గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే కార్మికులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉపేందర్‌ హెచ్చరించారు. గనుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. గతంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె పిలుపునిస్తే, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) వ్యతిరేకించేది. ఇప్పుడు టీబీజీకేఎస్‌ కూడా సమ్మెకు మద్దతు పలకడంతో సింగరేణిలో సమ్మె సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా సమ్మెలోకి టీబీజీకేఎస్‌

తెలంగాణ రాష్ట్రం (Telangana) ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీబీజీకేఎస్‌ సమ్మెలో పాల్గొనాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చి జాతీయ సంఘాల సమ్మెకు మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి కార్మికులు సకలజనుల సమ్మెలో సుదీర్ఘంగా 35 రోజులు పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని నిరూపించుకున్నారు. గతేడాది జూన్‌ నెలలో జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన్పటికీ, టీబీజీకేఎస్‌ దానికి దూరంగా ఉండడంతో సింగరేణిలో కొంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతోంది. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో కార్మికవర్గానికి జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతునివ్వకుంటే కార్మికవర్గంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జాతీయ సంఘాలకు టీబీజీకేఎస్‌ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమ్మెతో లక్ష్యాన్ని సింగరేణి చేరుకుంటుందా ?

మొన్నటి వరకు గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురువడంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తరుచూ విఘాతం ఏర్పడింది. సాధారణంగా వర్షాకాలం యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిని కుదించుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా యాజమాన్యం ప్రణాళిక రూపొందించుకుంది. సింగరేణిలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 292.53 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చుకుంటే 23.41 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా జరిగినప్పటికీ, మిగతా ఆరు మాసాల కాలంలో 407.47 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. ప్రస్తుతం వర్షాలతో ఉపరితల గనుల్లో నెలకు సగటున 49 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరు నెలల కాలంలో నెలకు 68 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు రెండున్నర లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తేనే వార్షిక లక్ష్యం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, సగటున 1.8 లక్షల ఉత్పత్తి జరుగుతోంది. సమ్మె జరిగితే రూ.50 కోట్ల మేర సింగరేణి యాజమాన్యానికి, రూ.23 కోట్లమేర సింగరేణి కార్మికులు జీతాల రూపంలో నష్టపోనున్నారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికుల వేతనాలు కలిపి దాదాపు రూ.73 కోట్ల నష్టం జరుగనుంది.

సమ్మెలోకి 48 వేల మంది కార్మికులు

సింగరేణిలో మొత్తం 48,019 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రామగుండం రీజియన్‌ పరిధిలోని ఆర్జీ–1, 2, 3, ఏఎల్‌పీ డివిజన్లలో సింగరేణిలోనే అత్యధికంగా 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమ్మెలో పాల్గొనాలని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌లు పిలుపునివ్వడం, దీనికి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ మద్దతునివ్వడంతో వీరంతా సమ్మెలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరో జాతీయ కార్మిక సంఘమైన బీఎంఎస్‌ ఈ నెల 23 నుంచి 27 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. భాజపాకు అనుకూలంగా వ్యవహరించే బీఎంఎస్‌ సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడంతో కోలిండియాలోనూ 24న సమ్మె ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు అంచనా వేస్తున్నారు.