Pattana Pragathi Programme 2020 | Photo: Official

Hyderabad, February 24: తెలంగాణలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 04 వరకు 10 రోజుల పాటు 'పట్టణ ప్రగతి కార్యక్రమం' జరగనుంది. పట్టణాల్లో ఉండే సమస్యలు ఎక్కడికక్కడ తీర్చేసి, పట్టణ రూపురేఖలు మారుస్తూ ప్రజల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఈ పదిరోజుల పాటు అధికారులు వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీతో కలిపి, రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల కోసం ప్రభుత్వం రూ, 148 కోట్ల నిధులను విడుదల చేసింది.

సీఎం కేసీఆర్ నిర్ధేషించిన లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని, పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పది రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల విశేషాలు ఇలా ఉన్నాయి.

  • వార్డుల వారిగా ప్రణాళిక తయారు చేయాలి. ప్రతీ పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తయారు కావాలి. కౌన్సిలర్/కార్పొరేటర్లను కలుపుకుని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రణాళిక తయారు చేయాలి. వార్డుల వారీగా నియామకమైన ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. ప్రతీ వార్డును ఎక్స్ రే తీయాలి. ఏమి ఉన్నాయి. ఏమి లేవు. ఏమి కావాలి. ఏమి చేయాలి అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.
  •  మంచిపట్టణం/మంచి నగరం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ప్రతీ రోజు చెత్తను, మురికిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన మంచినీరు సరఫరా జరగాలి. వీధి లైట్లు బాగా వెలగాలి. రహదారులపై గుంతలు, బొందలు, గోతులు ఉండకూడదు. పచ్చదనంతో పట్టణం కళకళలాడాలి. చెత్త నిర్మూలనకు డంప్ యార్డులు ఉండాలి. చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు దహనవాటికలు/ ఖనన వాటికలు ఉండాలి. పట్టణ జనాభాను అనుసరించి పరిశుభ్రమైన వెజ్-నాన్ వెజ్- ఫ్రూట్ – ఫ్లవర్ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. పట్టణంలోని యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ లు ఉండాలి.
  • ప్రతీ పట్టణంలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలు ఏమిటి అని నిర్ధారించుకుని వాటిని కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టణ ప్రజలకు, పట్టణాలకు వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలి. దీనికోసం ప్రభుత్వ స్థలాలను వినియోగించాలి. ఏ శాఖకు చెందిన స్థలమైనా సరే ప్రజోపయోగం వినియోగించే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు ఇస్తుంది. ఏ పట్టణానికి ఎన్ని టాయిలెట్లు, ఎక్కడ నిర్మించాలో నిర్ధారించుకుని మూడు నెలల్లో వాటి నిర్మాణం పూర్తి చేయాలి.

  • వీధులపై వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్ కోసం అన్ని పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ చేర్పాటు చేయాలి. వాటిలో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించే వరకు వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది.
  • ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్క్ చేయడానికి పార్కింగ్ సదుపాయం కల్పించాలి. దీనికోసం కూడా ప్రభుత్వ స్థలాలను వినియోగించే అధికారం కలెక్టర్లకు ప్రభుత్వం కల్పిస్తుంది.
  • ప్రమాద రహితమైన విద్యుత్ వ్యవస్థ కలిగి ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్ పాత్ లపై ఉండే ట్రాన్స్ ఫారాలను మార్చాలి. ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేయాలి. పొట్టి స్తంభాలను తొలగించి, పెద్ద స్తంభాలు వేయాలి. ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేనట్లయితే దానికి ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. కావాల్సిన పోళ్లను, తీగలను, ట్రాన్స్ ఫారాలను విద్యుత్ అధికారులు ముందుగానే సమకూర్చి ఆయా పట్టణాలకు పంపించాలి.
  • పల్లెల్లో సర్పంచుల మాదిరిగానే పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరించాలి. పెట్టిన మొక్కల్లో 85 శాతం బతికే బాధ్యతను వారు తీసుకోవాలి. ఆయా పట్టణాలకు అవసరమైనన్ని నర్సరీలను ఏర్పాటు చేయాలి. పట్టణంలో జాగా లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
  • ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీ చేయాలి. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చుకోవాలి.
  • డ్రైనేజీలు శుభ్రం చేయడానికి అనేక రకాల మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
  • పట్టణాలకు కేటాయించబడిన నిధుల వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి కేటాయించాలి. ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధులను కూడా పట్టణాల ప్రగతికి వినియోగించాలి.
  • కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
  • తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే చేపడుతుంది. ఇందులో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి. ఎవరికి వారు పూనుకుని తమ ప్రాంతంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి.