
Hyd, Jan 20: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. ఇదే సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి దావోస్ కు వెళ్లారు.
సోమవారం జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో దిగిన చంద్రబాబు బృందానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం తారసపడింది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Andhra CM Chandrababu and Telangana CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. మంత్రుల బృందంతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఫొటోలు దిగారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు భుజంపై ఏపీ సీఎం చంద్రబాబు చేతులేసి, షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా విదేశీ పెట్టుబడుల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో పర్యటిస్తున్నారు.
ఆదివారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా.. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జ్యూరిక్‌కు వెళ్లారు.జ్యూరిక్‌లోని హోటల్ హిల్టన్(Hotel Hilton)లో నిర్వహిస్తున్న "తెలుగు డయాస్పొరా మీట్"(Telugu Diaspora Meet)లో వీరిద్దరూ పాల్గొనున్నారు.ఈ సమావేశంలో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నాయి.స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.